రంగుల హోలీ

రంగుల హోలీ

సంత గమనంలో వస్తుంది రంగుల హోలీ.......
నింపుతుంది మీ జీవితాలలో ఆనందాల కేళీ......
అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు..

‘హోలీ’ వస్తుందంటే చాలు.. దేశమంతా పండుగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని ‘హోళికా పుర్ణిమ’గా కూడ వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను.. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ పండుగ పుట్టుపుర్వోత్తరాల గురించి పురాణాల్లో భిన్నగాథలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో చూడండి. తెలుగు మాసాలలో చివరిదైనా ఫాల్గుణ మాసంలో వచ్చే చివరి పండుగనే హోలీ. రంగు రంగుల ఈ పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అన్ని పండుగలు దాదాపు ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటాం. అయితే కలర్ ఫుల్ హోలీని మాత్రం రెండురోజు పాటు జరుపుకుంటాం.

ఈ పండుగ మార్చి నెలలో 28, 29వ తేదీన జరుపుకుంటారు. రెండురోజుల పాటు జరుపుకునే ఈ పండుగ సందర్భంగా హిందూ, ముస్లిం, క్రిస్టయన్ల అన్న మత భేదాలు లేకుండా చిన్న పిల్లాడి నుండి పెద్ద వారికి వరకు వీధుల్లోకి వచ్చి రంగుల మయంగా మార్చేస్తారు. దీని వల్ల జీవితం మొత్తం రంగుల మయంగా ఉంటుందని చాలా మంది ఆశిస్తారు.

హోళీ పండుగ ముందురోజు కాముని దహనం చేస్తారు. ఈ విధానం హోళీ ముందురోజు చలిమంటలు వేయడానికి కూడా పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పండుగ యొక్క ప్రధాన ఘట్టం మండుచున్న హోలీ మంటలు లేదా హోలీక. అంతేకాక కొందరి ఉద్దేశ్యం ప్రకారం రాక్షసి హోలిక, హోలక మరియు రాక్షసుల దహనం లేదా మదన్‌ను దహనం అని సంప్రదాయ హోలీ మంటల మూలాన్ని తెలుపుతాయి. హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదున్ని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా సంప్రదాయ భోగి మంటలను నిర్వహిస్తారు. ఎలాగంటే విజయదశమి రోజున రావణుడిని ప్రతిమను దహనం చేసినట్లుగా ఈ పండుగ రోజు కూడా ప్రతిమను దహనం చేస్తారు, ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో రాక్షసుల పరాక్రమం హోలిక దహనంతో అంతమయిందని దీని అర్థం, బ్రజ ప్రాంతాలలో, కర్రలను కుప్పగా పోగు చేసి ప్రజలు ఎక్కువగా తిరిగే కూడళ్ళలో లేదా వీధి చివరలో ప్రతిమలను దహనం చేస్తారు. సంప్రదాయమైన పూజలు అయిన తరువాత ప్రజలు మంటలకు ప్రదక్షిణ లు చేస్తారు. తరువాత రోజు ఈ విజయాన్ని దుల్‍‌హెండి రోజుగా ఘనంగా జరపుకొంటారు.

ఇదీ కథ..:...

హోళీ విశ్వవ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాశిస్తాయి. అక్కడ వివిధ రకాల రంగుల ఉత్పత్తి అయ్యి వృద్ధిపొంది , వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషం. పురాణ కథలతో పాటుగా హోళీ పండుగ వెనుక మరో పరమార్థం ఉంది. హోళీ పాడుగాను వసంత ఋతువు ఆగమనంగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది చలికాలం తొలగిపౌఇ ఎండాకాలం ఆరంభానికి నాంది ప్రస్థావన వంటిది. హోళీ పండుగను సాధారణంగా "ఫాల్గుణి పూర్ణిమ'' నాడు జరుపుకుంటారు. ఇలా ఒక ఋతువు వెళ్ళి మరో ఋతువు వచ్చే సమయంలో ముఖ్యంగా శీతాకాలం 'చలి' వెళ్ళిపోయి ఎండాకాలం 'వేడి' వచ్చే సమయంలో ఉష్ణోగ్రతల తేడావల్ల చర్మం చిట్లుతుంది. రంగులు ఆ చిట్లటం వల్ల కలిగే చికాకును తగ్గిస్తాయి.

వైష్ణవములో, రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, చాలా కాలం తపస్సు చేసి, తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. ఇతడిని "పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు, శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి, స్వర్గం మరియు భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు. దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. రాక్షస రాజు హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణు మూర్తిని స్మరిస్తుంటాడు. అది హిరణ్యకశపుడికి నచ్చదు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము. భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో (సగం మనిషి మరియు సగం సింహం) వచ్చి హిరణ్యకశ్యపుడిని సంధ్యా సమయంలో (పగలు లేదా రాత్రి కాని) అతని ఇంటి గడప మెట్లపై (లోపల లేదా ఇంటి బయట కాదు) తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని (ఆకాశంలో లేదా భూమి పైన కాదు) మరియు తన యొక్క పంజాతో చీల్చి చెండాడినాడు (అస్త్రాలు లేదా శస్త్రాలచే కాకుండా). హోలిక దహనమైన రోజునే ‘హోలీ’ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ ‘హోలిక’ దహనం నిర్వహిస్తారు.

హోళికపై మరో కథ:
కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు వుండేవాడు. ఓ రోజు ప్రజలంతా వచ్చి ‘హోళిక’ అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తోందని మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి.. ఏటా ఫాల్గుణ పూర్ణిమ రోజు హోళికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు. ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని, అంతా రాత్రివేళ నిర్వహించాలని వివరిస్తాడు. దీంతో అప్పటి నుంచి ‘హోలీ’ పూజలు నిర్వహిస్తున్నట్లు పూర్వికులు తెలుపుతుంటారు.

రాధ మరియు గోపికల హోళీ : ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడి పెరిగిన ప్రాంతాలైన మథుర మరియు బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు (ప్రతి సంవత్సరం రంగపంచమి రోజున భగవంతుడైన కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు). భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని రంగు మరియు రాధ యొక్క శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి తల్లి రాధ ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంది. అధికారికంగా ఈ ఉత్సవాలు వసంతఋతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు. హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ ఉంది. ఈ కథ ప్రేమ దేవుడైన కామదేవుడు గురించి తెలుపుతుంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచడానికి అతనిపై పూల బాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేసాడు. తరువాత శివుడు, తన త్రినేత్రాన్ని తెరిచి, కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు. కామదేవుని భార్య రతి కోరికమేరకు శివుడు కామదేవుడిని మళ్ళీ బ్రతికిస్తాడు కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరితప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు.

డోలిక అంటే?:
డోలిక అంటే ఉయ్యాల అని అర్థం. బాలబాలకృష్ణుడిని ఫాల్గుణ మాసం, పూర్ణిమ తిథిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఊయలలో వేసి ‘డోలికోత్సవం’ జరుపుతారు. ఈ హోలి రోజున శ్రీకృష్ణుడు.. రాధను ఊయాలలో పెట్టి రంగులు పులిమినట్లు కూడా చెబుతుంటారు.

దేశంలో వివిధ ప్రాంతా ల్లో హోళీ వేడుకలు: ఒరిస్సాలోని జగన్నాథ, పూరీ ఆలయాలలో కృష్ణుడు, రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపించి ఆ తరువాత వేడుకలు ప్రారంభిస్తారు. గుజరాత్ లో ఈ పండగను అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా మంటలు వేసి దాని చుట్టూ చేరి నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందిస్తారు. అందరూ పెద్ద మైదానం లాంటి ప్రదేశం వద్ద గుమికూడి సామూహికంగా కూడా మంటలు వేస్తారు. ఈ మంటల్లో ఇంట్లో ఉన్న పాత చెక్కసామానులన్నీ తీసుకొచ్చి వేస్తారు. మహారాష్ట్రలో హోళీక దిష్టిబొమ్మను దహనం చేస్తారు. హోళీ వేడుకకు ఒక వారం ముందు యవకులు ఇంటింటికి తిరిగి పాత చెక్క సామానులు సేకరిస్తారు. ఉదయం వేసిన మంటలు సాయంత్రం దాకా మండుతూనే ఉంటాయి. అంత పెద్ద ఎత్తున మంటలు వేస్తారు. ఈ మంటలకు ప్రత్యేకంగా చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. మణిపూర్ లో ఓ ఆచారం ఉంది. మగపిల్లలు ఆడపిల్లలకు డబ్బులు ఇస్తేనే ఆడపిల్లలు వారి మీద రంగులు చల్లుతారు. రాత్రి సమయంలో చిన్నాపెద్దా అందరూ కలిసి ఒక చోట చేరి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తారు. ఇక్కడ వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. చివరిరోజు కృష్ణుడి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. సైనికుల పహారాలో, తుపాకుల చప్పళ్ళతో ఉద్రిక్తంగా ఉండే అందాల కాశ్మీర్ లో సైనికులతో సహా అందరూ హోళీ ఉత్సవాలలో పాల్గొంటారు. ఆటపాటలతో రంగు నీటిని ఒకరిమీద మరొకరు చల్లుకుంటారు.


ఆరోగ్య హోళీ!: హోళీ రంగులతో శరీరానికి అనర్థాలు జరగకుండా ఉండాలంటే వాటి ప్రభావం నుంచి కాపాడే సురక్షిత పద్ధతులు అనుసరించాలి. హోలీకి ముందు, తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవీ! హోళీకి ఒకరోజు ముందు ఒళ్లంతా ఆవ నూనె పూసుకోవాలి. ముఖం, మెడ, కాళ్లు, చేతులు మొదలైన హోలీ రంగులు అంటుకునే ప్రదేశాలకు నూనె పూసుకోవాలి. ఆవ నూనె రంగులు అంటుకోకుండా చర్మానికి రక్షణ కవచంలా పని చేయడంతో పాటు రంగులను తేలికగా వదిలించేటందుకు తోడ్పడుతుంది. వెంట్రుకలకు కొబ్బరి నూనె పూసుకోవాలి. కొబ్బరి నూనె హోలీ రంగులు కుదుళ్లలోకి ఇంకిపోకుండా కాపాడుతుంది. ప్రత్యామ్నాయంగా లోషన్‌ కూడా వాడవచ్చు. దీంతో కూడా రంగులు అంటుకుపోకుండా ఉంటాయి. వాటిని వదిలించడమూ తేలికవుతుంది. కళ్లు, ముక్కు భద్రంగా కళ్లలో హోలీ రంగు పొడి పడితే ఎక్కువ నీళ్లతో కళ్లను కడగాలి. హోళీ రోజు తరచుగా కళ్లు కడుగుతూ ఉండాలి. కొద్దిగా గులాబీ నీళ్లు కళ్లలో వేసుకుని పడుకోవాలి. ఇలా చేస్తే కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది. చర్మపు ఎలర్జీలకు మార్కెట్లో దొరికే ఎక్కువ శాతం రంగులన్నీ రసాయనాలతో తయారయ్యేవే! కాబట్టి వాటికి బదులు ఆర్గానిక్‌ రంగులు వాడాలి. చర్మం మీద ఏదైనా మార్పు కనిపిస్తే ఈ చిట్కాలు పాటించాలి. హోళీ ఆటకు వెళ్లే ముందు ముల్తాని మట్టి నీళ్లలో నానబెట్టి ఉంచుకోవాలి. తిరిగి వచ్చిన తర్వాత రంగు అంటుకున్న ప్రదేశాలు కడిగి ముల్తాని మట్టి అప్లై చేస్తే ఎలర్జీలు తలెత్తకుండా ఉంటాయి.సెనగపిండి, స్వీట్‌ ఆయిల్‌, మీగడ, రోజ్‌ వాటర్‌తో చిక్కని పేస్ట్‌ తయారు చేసి ముఖం, చేతులు, మెడ, కాళ్ల మీద అప్లై చేసి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత రుద్ది కడిగేసుకుంటే చర్మం మీద వచ్చిన దద్దుర్లు తగ్గుతాయి.

హోలీ పండుగ రోజున ఒకరినొకరు ఆప్యాయంగా చల్లుకునేది రంగులు కాదు....
అనురాగం, ఆప్యాయతలతో కలిసిన పన్నీటి రంగుల జల్లులు.....

మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

Popular posts from this blog

శ్రీ సాయి సత్ చరిత్రము – ప్రార్థన