శ్రీ సాయి సత్ చరిత్రము – ప్రార్థన
శ్రీ సాయి సత్ చరిత్రము – ప్రార్థన (శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము)
ఓం శ్రీ సాయి నాథాయ నమః
శ్రీ సచ్చిదానంద సత్గురు సాయినాథ్ మహారాజ్ పాదాలకు నమస్కారించి తెలియజేయునది ఏమనగా శ్రీ సాయి సచ్చారిత్ర యొక్క ప్రతి అధ్యాయాన్ని యూట్యూబ్ ద్వారా సాయి భక్తులకు చేరవేయడానికి మేము చేసేన భక్తిపూర్వక ప్రయత్నము, శ్రీసాయిబాబా యొక్క మహిమలు, వింతలీలలును వినిన మనస్సునకు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందము కలుగును. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రమువలె విశాలమైనది. లోతైనది. అందరు దీనియందు మునిగి భక్తి జ్ఞాన మణులను తీసి తరించ ప్రార్థన.
శ్రీ సాయిబాబా జీవిత చరిత్రను మన చెవులద్వారా హృదయమందు ప్రవేశించునపుడు శరీర స్పృహయును, అహంకారమును, ద్వంద్వభావములును నిష్క్రమించును. అవి మన హృదయమందు నిల్వచేసినచో సందేహములు పటాపంచలయిపోవును. శరీరగర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వచేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి, వర్ణనలు ప్రేమతో పాడినగాని వినినగాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి యివియే మోక్షమునకు సులభసాధనము.
శ్రీ సాయిబాబా పలుకులు - నేనందరి హృదయముల పాలించు వాడను, అందరి హృదయములలో నివసించువాడను. ప్రపంచమందుగల చరాచర జీవకోటి నావరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టిస్థితిలయకారకుడను నేనే. ఎవరయితే తమ దృష్టిని నావైపు త్రిప్పెదరో వారిని మాయ శిక్షించదు. పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచరజీవకోటి యంతయు నా శరీరమే, నా రూపమే.” ఎవరయితే శరణాగతి వేడెదరో, నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా యాకారమును మనస్సున నిలిపెదరో వారిని మాయా బంధనములనుండి తప్పించి మోక్షమును సంపాదించును.